
posted on Jun 7, 2025 9:30AM
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.
“ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం
అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం”
ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి.
ఆశయం!!
ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.
ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి. ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.
ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది. ఇదీ ఆశయంలో ఉన్న సారం.
అత్యాశ!!
కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.
కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.
ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు.
ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.
లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.
ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.
ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.
◆నిశ్శబ్ద.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.