
posted on Jun 4, 2025 9:30AM
ఆశనిరాశల్ని….. విజయవైఫల్యాల్ని మైలురాళ్ళుగా మిగిల్చి మరో సంవత్సరం మన కళ్ళముందు నుంచి కనుమరుగయింది. సరికొత్త సవాళ్ళతో మనం ఎంత సాహసి కులమో తేల్చేందుకు కొత్త సంవత్సరం స్వాగతించింది. నిజానికి కాలానికి తరతమ భేదాలుండవు. అందరికీ మంచినే పంచాలనుకుంటుంది. కాని ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారికి ఆ యా ఫలితాల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఆశావహులకు బృందావనమైతే… నిరాశావాదులకు అదే కాలం కాటేసే కాలనాగవుతుంది. గతాన్ని గతంలోనే పూడ్చిపెట్టి… సరికొత్త ఆశలతో ముందుకు సాగిపోవాలి. అందుకోసం అందరూ పాటించాల్సిన కొన్ని విషయాలివి.
అస్పష్టం… అనాలోచితం
ప్రస్తుతం చాలా సందర్భాల్లో విఫలమవడానికి కారణం మన పరిధిని, మన సామర్ధ్యాన్ని మనం సరిగ్గా అంచనా వేసుకోకపోవడం. ఫలితంగా చాలా మంది జీవితాలు అస్పష్టంగా, అనాలోచితంగా సాగిపోతున్నాయి. ఆంగ్ల విద్యావేత్త బ్రెండన్ ‘once we accept our limits, we go beyond them’ అంటారు. ముందు మన పరిమితుల్ని, వనరుల్ని తెలుసుకోగలగాలి. కాని దురదృష్టవశాత్తూ మనలో చాలామంది వయసు మించిపోతున్నా వారి వారి సామర్ధ్యాల్ని గుర్తించి మసలుకోలేకపోతున్నారు. పరుగులయితే పెడుతున్నాం… కానీ ఎక్కడికో చెప్పలేకపోతున్నాం. అలసిపోతున్నాం. కాని అసలు ఎందుకో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ముందు ఈ కొత్త ఏడాది లోనైనా మన గమ్యం పట్ల పూర్తి స్పష్టతను ఏర్పరచుకుంటే మంచిది. దానికి అనుగుణంగా మన గమనాన్ని నిర్దేశించుకావాలి.
ఆధునిక బలహీనతలు.. అష్టకష్టాలు..
సహజంగా మనలో ఉండే బలహీనతలకు తోడు నేడు ఆధునికమైనవి కూడా వచ్చి తోడయ్యాయి. అసలే కోతి, ఆపై పిచ్చి, కల్లు తాగి, నిప్పులు తొక్కి…. అన్నట్లుగా మారిపోయింది ప్రస్తుతం మన మనఃస్థితి. యుక్తవయసులో అసలే కుదురుగా ఉండని మనస్సును సెల్ఫోన్లు, ఇంటర్నెట్లు మరింత ఇరకాటంలో పడేశాయి. ఆధునిక మానవుడికి సెల్ఫోన్ రూపంలో మరో శరీరభాగం వచ్చి చేరినట్లయింది. విలాసాల్ని అవసరాలుగా భ్రమించడం వల్లనే ఈ ప్రమాదమంతా. ఇవి మానసికంగా, శారీరకంగా ఎంత బలహీనుల్ని చేస్తున్నాయో యువతీయువకులు గమనించడం లేదు. ముఖ్యంగా జీవితానికి పటిష్టమైన మార్గాన్ని నిర్మించుకోవలసిన విలువైన ప్రాయంలో ఇవి ఏకాగ్రతను ఛిన్నాభిన్నం చేస్తాయి. ‘simple living high thinking’ ను జీవనశైలికి మలచుకోవాలి. అలా చేస్తే ఈ ఆధునిక బలహీనతల నుండి బయటపడవచ్చు.
ఆహారాలు… ఆహార్యాలు…
భగవద్గీతను చదవడం కన్నా ముందు ఫుట్బాల్ ఆడి శరీరాన్ని దృఢం చేసుకోండి. మానసికంగా, శారీరకంగా బలహీనపరిచే దేనినయినా విషంలా తిరస్కరించండి అనే వారు స్వామి వివేకానంద. బాణం గురి చేరాలంటే ముందు ధనుస్సు బలంగా ఉండాలి. ధనుస్సే బలహీనంగా ఉంటే, ఇక బాణం గురించి చెప్పేదేముంటుంది. ఆధునికత పేరుతో అస్తవ్యస్తమైన ఆహార, ఆహార్యాల వెంట పరుగులు తీస్తున్నాం. అందుకే మనలో చాలామంది ముఖాల్లో కృత్రిమ కాంతులు…. అద్దకపు అందాలు. వీటన్నింటికీ కారణం మన జీవనంలో సహజత్వం లోపించడం. పసిబిడ్డ ఉగ్గుపాల నుంచి పండ్లరసాల వరకు అన్నింటినీ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. భారతీయ జీవనవిధానానికి సరిపోలని సంస్కృతుల్ని దిగుమతి చేసుకొని మనకు మనమే కృతకంగా బ్రతుకులీడుస్తున్నాం. ఆహార, ఆహార్యాలనేవి వారి వారి భౌగోళిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వారసత్వంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒకరు ఇంకొకరి ఆహార, ఆహార్య, ఆచారాలను గుడ్డిగా అనుకరించడం వలన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోతుంది. అందుకే భౌతికంగా, బౌద్ధికంగా మనల్ని ధీరోదాత్తులను చేసే జీవనశైలిని అలవరచుకుంటే కొత్త ఏడాదిలో జీవితం విజయానికి చేరువ అవుతుంది.
*నిశ్శబ్ద.
Discover more from తెలుగు న్యూస్ బ్లాగ్స్
Subscribe to get the latest posts sent to your email.